సినిమా కి వేళాయరా…
సినిమా మొదలైంది… నేను టికెట్ కౌంటర్ దెగ్గర..
“అన్న రెండు బాల్కనీ”
“నిజంగానా?”
“ఆ…”
“పక్కనున్న జర్నీ కి పోక ఈ *** (పువ్వులో) సినిమాకి దేనికన్నా?”
“అదేంటి?”
“నీదే బోని. 1st బాల్కనీ టికెట్ ఇది.. ఇమ్మంటావా?”
“ఆ ఇవ్వు.”
హౌస్ ఫుల్ అయిద్దనుకుని టికెట్ మీద సీట్ నెంబర్లు వేసినట్టున్నాడు. ఇంపాసిబుల్ అని తెలుసుకుని మళ్ళి కొట్టేసాడు.. థియేటర్ అంతా మీదేగా పండగ చేస్కోండి అన్నట్టు..
లోపలికేల్లాం.. అదేదో స్మశాన వాటిక లా, కుర్చిలన్నీ సమాదుల్లా.. నిర్మానుష్యంగా వుంది హాలంతా.. స్క్రీన్ మీద హీరో అదేదో వ్యాయామం చేస్తున్నాడు. of course అదేం వ్యాయామమో ఓ మాకర్ధం కాలేదు. కాళ్ళు చేతులు రెండు నేలమీద పెట్టి ఎగురుతున్నాడు. ఫీట్ బావుంది కదా అని ఇద్దరం ఆపుకోలేక ఈలలేసాం.. హాల్ అంతా మాదే..
నేను – “పద A row కూర్చుందాం”
రఘు – “నాకు భయంగా ఉంది.. ఇక్కడే కూర్చుందాం..” (స్క్రీన్ ఎదురు)
“నీ.. పద బే.. అన్న సినిమా ఈడనుండా చూసేది?”
అని లాక్కేల్లా.. A row లో మధ్య సీట్ల లో కూర్చున్నాం. ప్రొజెక్టర్ మా పైనే ఉంది.
మా అదృష్టం బావుండి ఎల్లినెమ్మటే ఓ సాంగ్ వచ్చింది. of course ఎందుకు సాంగ్ వచ్చిందో మాకర్ధం కాలేదు. (ఇలాంటి of course లు బోలేడుంటాయ్ .. ఇంక సెపరేట్ గా మేన్షన్ చెయ్యను).. సాంగ్ లో ప్రతి స్టెప్పు ఒక ఆణిముత్యం. ఇంక డ్రామా మొదలెట్టాడు. మొహం మీద అన్ని నవ రసాలు ఒకే సారి పండిన్చేసరికి సరికి అదేరసమో మాకర్ధం కాల.. ఇంక రసాల గురించి dicuss చెయ్యకూడదని ఒట్టేసుకున్నాం. (“మాకు” అని ఎందుకంటున్నా అంటే.. హాల్ లో సినిమా చూసేది మేమిద్దరమే. నెల టికెట్లు కొన్నోల్లంతా బా తాగొచ్చినట్టున్నారు. బొబ్బున్నారు. అసలు ఈలలు ఎయ్యల.)
ఇక ఒక ఫైట్ వచ్చింది. రఘు ఆపుకోలేక పోయాడు.
“అన్నా………….” అని గొంతు చించుకుని గట్టిగా కేకేసాడు..
“జెండుబాం తెచ్చుకున్నావా?” అని ప్రొజెక్టర్ బాయ్ అరిసాడు
“మాకు తెల్సు. పూస్కోనే వచ్చాం” అని రఘు అరిసాడు.
“సినిమా వంద రోజులంట…….” అని ప్రొజెక్టర్ బాయ్ అరిసాడు..
నేను, సినిమా బాగా నచ్చేసరికి, అతన్ని ఓడించాలని, “రెండొందల రోజులు…” అని అరిసా.. నా అరుపు ఇనిపించినట్టుంది.. మా హీరో ముల్లోకాలు కనిపించేట్టు ఒక షాట్ కొట్టాడు. ఒక్కడ్నే కొట్టాడు. ఒక్క సారే కొట్టాడు. కానీ నలుగురు ఎగిరారు. నాలుగు సార్లు ఎగిరారు. మేము చెప్పట్లు కొట్టాం. కొడుతూనే ఉన్నాం.
ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం ఎవర్ని చంపుదామా అని ఎదురు చూస్తున్న డైరెక్టర్ కి హీరోయిన్ ఖాలీగా కనిపించింది. చంపేసాడు
(((( .. ఇంటర్వెల్ అని పడింది.. అప్పుడే ఇంటర్వెల్ ఏంట్రా అని అనుకుని అప్పుడెప్పుడో మొదలెట్టిన చెప్పట్లు ఇప్పుడాపేసాం.. అంతలా నచ్చింది ఆ ఫైట్…
ఎల్లిపోదామా అనే ఒక్క మాట కూడా మా మధ్య లేదు.. అంతగా నచ్చేసింది సినిమా ఇద్దరికీ. బిజినెస్ మాన్ ట్రైలర్ ఏసాడు.. “ఉచ్చ పోయించటానికి రాలే.. ఉచ్చ పోయటానికొచ్చా.. బాత్రూం ఎటు..” అని మహేష్ ఏదో డైలాగ్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ లో అన్ని పిచ్చెక్కిచ్చే పవర్ఫుల్ యాక్షన్ + కామెడీ + డ్రామా + హర్రర్ + థ్రిల్లర్ + ఇంకేమన్నా ఉంటే అయ్యి.. అన్ని కలిపి ఉన్న ఎన్నో డైలాగులు చూసాక ఈ మహేష్ డైలాగ్ ఎక్కల. ఇంటర్వెల్ అయిపొయింది.
హీరో ఈ హాఫ్ లో తోటకూర బస్తి సేవ అంటే ఏంటో చూపించాడు. (హీరో ఉండే ఏరియా పేరు తోటకూర బస్తి). ఈ సీన్లలో నవరసాలు ఆపకుండా పండించే సరికి మా గుండెలు చలించాయి.
సెకండ్ హీరోయిన్ గురించి కూడా చెప్పుకోవాలండోయ్ . యాక్షన్ లో హీరో కి ఏ మాత్రం తగ్గల. అరుపులు. లవ్ సీన్లు ఒకరి మీద ఒకరు పడి యమాగా పండించారు.
క్లైమాక్స్ ముందు రఘు కి ఓపిక నశించింది.
రఘు – “నేను బైక్ తీసి రెడీ గా ఉంటా.. రా తొందరగా.” అని ఎల్లిపోయాడు.
నాలో సినిమా మొత్తం చూడాలి అనే ఒక మొండి పట్టుదల పోల. చూడాల్సిందే అని కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చున్నా.
హీరో తనలో తాను మధనపడే సీన్లు సినిమా కే హైలైట్ అని చెప్పుకోవచ్చు.. నవ రసాలని నూట ఎనభై రసాలుగా చూపించాడు.. ఏది ఏ రసమో తెలుసుకోండి చూద్దాం అనే సవాలు విసిరాడు ప్రేక్షకులకి.. రఘు అసల సినిమా ఇక్కడ మిస్సయ్యాడు. తిరుమల వెళ్లి ఆ వెంకటేస్వరున్ని చూడకుండా వచ్చినట్టుంది. పిచ్చివాడా అని నవ్వుకున్నా..
క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఎవరు రోల్ లేకుండా ఖాలీగా ఉన్నారా అని ఎదురు చూస్తున్నాడు.. హీరో ఖాళీగానే ఉన్నాడు. ఎస్. ఇదే టైం అనుకున్నాడు. వెంటనే.. హీరో బట్టలిడిచేసి, ఓ టబ్ లో పడుకొని, మీద ఐస్ క్యూబులు పోస్కొని, విరహ పాట పాడుతూ ప్రాణాలు విడుస్తాడు. .. అబ్బో .. ఈ దశాబ్దానికే హైలైట్ సాంగ్ అది.. విరహం మాత్రమే పండగల ఆ సీన్ లో, తన ముఖకవలికలతో పండనంటున్నా సరే పదే పదే పండించాడు అన్ని నవరసాల్ని. అయినా విరహ వేదన లో కామెడీ ని కూడా పండించడం మా నవరస మాంత్రికుడికే సాధ్యం B-)
HATS OFF to our dynamic ACTOR-STORY-SCREENPLAY-PRODUCER-DIRECTOR —– నూట ఎనభై రసాల నవ యువ నటుడు …… హరనాథ్ పొలిచెర్ల
అవును. మేమెల్లింది ది “రాజేంద్ర” కి …..
అలెక్స్, చంద్రహాస్ ల రూపం లో ఫ్యాన్స్ గుండెల్లోకి చొచ్చుకెల్లిన మా నట కిషోరం, రాజేంద్ర తో మళ్ళి చొచ్చుకుపోవటం అనేది.. ఒక చెప్పలేని ఫీలింగ్
ఇది మీ గుండెల్లో నిలిచిపోయే సినిమా.. మీరూ తప్పక వెళ్ళండి. నవరసాల్ని ఆస్వాదించండి. హాల్ లో మీ పక్కన ఒకరుండాలని మటుకు కోరుకోవద్దు. కష్టం. ధైర్యం అందరికీ ఉండదని మీరు గ్రహించాలి. పోనీ హాల్ లో ఏ మూలనో ఎవరన్నా పొరపాటున ఉంటే పిలుచుకోండి. ఎవరు లేకపోతే హాల్లో పని చేసే వాళ్ళని పిలుచుకోండి. వాళ్ళు ఉత్తినే రాకపోవచ్చు. వెయ్యో, రెండువేలో ఇస్తే ఇంటర్వెల్ దాకా చూడటానికి ఒప్పుకోవచ్చు. అదీ చెప్పలేం. డిపెండ్స్.
కొన్ని హైలైట్ లు
——————–
1) హరనాథ్ హెయిర్ స్టైల్ కేక (కుక్క బొచ్చు లా పిచ్చ క్యూట్ గా ఉంది)
2) హరనాథ్ రన్నింగ్ స్టైల్ కేక (ఇప్పటి దాకా వాడుకలో ఉన్న, ఒక పక్కకి వంగి ఉరికే, మహేష్ బాబు స్టైల్ చాప్టర్ ఇక్కడితో క్లోజ్. హరనాథ్ స్టైల్ ని వర్ణించలేకపోతున్నందుకు సారీ. మీరూ వెళ్లి చూడాల్సిందే. అదేదో కాలు లేపీ లేపనట్టుగా.. చేతులు ఊపి ఊపనట్టుగా.. అసల మనిషి కదులుతున్నాడా కదలటంలేదా అన్నట్టుగా.. అసలిది సాధ్యమేనా అన్న రీతి లో ఉరికాడు.. ఏమోనండి.. ముందే చెప్పా ఆ పరుగు వర్ణనాతీతం.)
3) హరనాథ్ బట్టలు కేక (చిన్న పిల్లలు వేస్కునే పూల చొక్కాలు, డ్రాయర్లు మాత్రమే దొరికినట్టున్నాయ్.. వాటినే కాస్త అటు ఇటు కుట్టి వేసారు హరనాథ్ గారికి .. ఆ బట్టలకే అందం వచ్చిందంటే నమ్మరు మీరు.)
4) హరనాథ్ కళ్ళజోడు కేక. ఉత్తికేక అనుకునేరు.. పోలి కేక. (ఆ నల్లద్దాలలో, నల్ల బండి మీద, నల్ల షర్టు తో,… నా సామిరంగా అనిపించాడు.)
ఇంక చెప్పే ఓపిక లేక ఆగుతున్నా. నిజం చెప్పాలంటే.. అసల సినిమా అంతా highlights అన్నట్టే ఉంది. ఇదో కల్ట్ క్లాసిక్.. మిస్ అవ్వదు.
అదృష్టం ఒక్కసారే తలుపు తట్టిద్దంట. దరిద్రం తీసేదాకా తట్టిద్దంట. ఇదీ అంతే.. మంచి సినిమా లు చూడు చూడు అని చూసేదాకా అంటాయి. కాని ఇలాంటి అద్భుత సినిమాలు చూడు అని వదిలేస్తాయ్. B-)